Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లోనే అహ్మద్ మసూద్.. పంజ్‌షీర్‌లో పోరు తీవ్రం

Panjshir resistance forces leader Ahmad Massoud has not left Afghanistan
  • మసూద్ టర్కీ పారిపోయారన్న వార్తలను ఖండించిన ఇరాన్ వార్తా సంస్థ
  • సురక్షిత ప్రాంతంలో ఉంటూ లోయతో సంబంధాలు కొనసాగింపు
  • గత నాలుగు రోజులుగా భీకర యుద్ధం
  • ఇరు వైపులా భారీ ప్రాణ నష్టం
పంజ్‌షీర్‌ ప్రావిన్స్ తాలిబన్ల చేతికి చిక్కకుండా పోరాడుతున్న ఆఫ్ఘన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ (ఎన్ఆర్ఎఫ్) నేత అహ్మద్ మసూద్ ఇంకా అక్కడే ఉన్నారని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ ఓ కథనంలో తెలిపింది. పంజ్‌షీర్ తాలిబన్ల వశమైందని, దీంతో అహ్మద్ మసూద్ టర్కీకి పారిపోయారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ఆయన అక్కడే సురక్షితమైన ప్రాంతంలో ఉంటూ పంజ్‌షీర్‌ లోయతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆ కథనంలో పేర్కొంది.

కాగా, పంజ్‌షీర్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్టు చేసిన తాలిబన్ల ప్రకటనను ఎన్ఆర్ఎఫ్ దళాలు ఖండించాయి. మరోవైపు, అహ్మద్ మసూద్ సన్నిహితుడు ఖాసీం మహమ్మదీ మాట్లాడుతూ.. పంజ్‌షీర్‌లోని 70 శాతం రహదారులు తాలిబన్ల అధీనంలోనే ఉన్నాయని, అయితే, లోయలోని అత్యంత కీలక ప్రాంతాలు ఇంకా ఎన్ఆర్ఎఫ్ దళాల చేతల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరు వైపుల భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది.
Afghanistan
Taliban
Iran
NRF
Ahmad Massoud

More Telugu News