COVID19: కరోనా సోకిన నెల రోజుల్లో చనిపోతే అది కరోనా మరణమే
- కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాలు
- ఈనెల 3నే విడుదల చేసిన ఆరోగ్య శాఖ
- సుప్రీంకోర్టుకు వెల్లడించిన ప్రభుత్వం
కరోనా మరణాలపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)తో కలిసి ఆ మార్గదర్శకాలను రూపొందించామని సుప్రీంకోర్టుకు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 3నే ఆ మార్గదర్శకాలను విడుదల చేశామని, దాని ప్రకారం ఎవరైనా వ్యక్తి కరోనా సోకిన 30 రోజుల్లోగా చనిపోతే దానిని కరోనా మరణంగానే పరిగణించాలని పేర్కొంది.
ఆసుపత్రిలో చనిపోయినా.. లేదా బయట చనిపోయినా కరోనా మరణంగానే గుర్తించాలని సూచించాలని చెప్పింది. ఇంట్లో లేదా ఆసుపత్రిలో చనిపోయి ఉండి.. ఇప్పటిదాకా స్పష్టత లేని కేసులనూ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ చట్టం ప్రకారం కరోనా మరణాలుగానే చూడాలని స్పష్టం చేసింది.
కరోనా సోకిన వ్యక్తి యాక్సిడెంట్ లో లేదా విషం తాగి చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా కరోనా మరణంగా పరిగణించకూడదని తేల్చి చెప్పింది. కరోనా సోకిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ పై కుటుంబ సభ్యులకు అభ్యంతరాలుంటే.. జిల్లా స్థాయిలో కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని సూచించింది.