Ajay Jadeja: టీమిండియా మెంటార్ గా ధోనీ నియామకంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన అజయ్ జడేజా
- వచ్చే నెలలో యూఏఈలో టీ20 వరల్డ్ కప్
- టీమిండియా మెంటార్ గా ధోనీ
- బీసీసీఐ నిర్ణయంపై మాజీల విమర్శలు
- జట్టుకు మెంటార్ అవసరంలేదన్న జడేజా
టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాకు ధోనీని మెంటార్ గా నియమించడం పట్ల మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా మాజీ ఆటగాడు అజయ్ జడేజా ఈ అంశంపై స్పందించారు. ధోనీని ఇప్పటికిప్పుడు టీమిండియా సలహాదారుగా నియమించడం వెనుక బీసీసీఐ ఉద్దేశం ఏంటో అర్థం కావడంలేదని అన్నారు. ఈ దశలో అతడు ఏ విధంగా జట్టుకు ఉపయుక్తంగా ఉంటాడన్నది తనకు అంతుబట్టడంలేదని వ్యాఖ్యానించారు. ధోనీకి తనకంటే పెద్ద అభిమాని మరొకరు ఉండరని, కానీ బీసీసీఐ నిర్ణయం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా మెరుగైన ఫలితాలు సాధిస్తోందని, జట్టుకు మెంటార్ అవసరంలేదని అజయ్ జడేజా స్పష్టం చేశారు. జట్టుకు ఓ కోచ్ ఉన్నాడు. అతడు జట్టును వరల్డ్ నెంబర్ వన్ గా తీర్చిదిద్దాడు. ఇలాంటప్పుడు రాత్రికిరాత్రే మెంటార్ ను నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు.