Taliban: ఆఫ్ఘన్ లో మహిళల విద్యపై కీలక నిర్ణయం... అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన తాలిబన్లు

Taliban takes key decision on women education in Afghan
  • మహిళల విద్యకు సానుకూలత
  • వర్సిటీల్లో చదువుకునేందుకు అనుమతి
  • స్త్రీ, పురుషులకు వేర్వేరు తరగతులు
  • స్త్రీలు ఇస్లామిక్ దుస్తులే ధరించాలని నిబంధన
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధులవుతున్న తాలిబన్లు దేశంలో మహిళల విద్యపై కీలక నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీల్లో మహిళలు చదువుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, స్త్రీ, పురుషులకు వేర్వేరు తరగతులు ఉంటాయని స్పష్టం చేశారు. మహిళలు తప్పనిసరిగా ఇస్లామిక్ సంప్రదాయ దుస్తులే ధరించాలని నిబంధన విధించారు. బోధన అంశాల్లోనూ పలు మార్పులు తెస్తామని తాలిబన్ మధ్యంతర ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియమితుడైన అబ్దుల్ బఖీ హక్కానీ వెల్లడించారు.

ఇటీవల తాలిబన్లు ఆఫ్ఘన్ లో మరోసారి పీఠం ఎక్కిన నేపథ్యంలో యావత్ ప్రపంచం వారి తీరును గమనిస్తోంది. 1990లో తొలిసారి అధికారం చేపట్టిన సమయంలో తాలిబన్లు మహిళలకు విద్యను నిరాకరించారు. ప్రజాజీవనంలో మహిళల పాత్రను వారు తిరస్కరించారు. తాజా నిర్ణయంతో తాలిబన్లు కొద్దిమేర మెరుగైనట్టు భావించాలి.

కాగా, తాలిబన్ల తాజా నిర్ణయాన్ని ఆఫ్ఘన్ మహిళలు స్వాగతిస్తున్నట్టు తెలిసింది. కాబూల్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ సదస్సులో మహిళలు తాలిబన్ జెండాలను ప్రదర్శించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
Taliban
Afghanistan
Women
Education
University

More Telugu News