suman: డ్రగ్స్ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలి: సినీ నటుడు సుమన్
- దేశంలో అన్ని చోట్లా డ్రగ్స్ వ్యవహారం వుంది
- సినీరంగంలో బయటపడితే మీడియాలో బాగా పబ్లిసిటీ
- విదేశాల్లో ఉన్నట్లు కఠిన శిక్షలు వుండాలి
- 'మా' ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న సుమన్
టాలీవుడ్లో డ్రగ్స్ కేసుల గురించి సినీనటుడు సుమన్ స్పందిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటే డ్రగ్స్ అమ్మకాలు, వినియోగం వంటివి పునరావృతం కావని చెప్పారు. నెల్లూరులో గౌడ కల్లు గీత పారిశ్రామిక సంఘం, గౌడ సేవా సమితి ట్రస్ట్ సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... డ్రగ్స్ వ్యవహారం కేవలం సినీ రంగంలోనే కాకుండా దేశంలో అన్ని చోట్లా ఉందని చెప్పారు.
అయితే, సినీరంగంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడితే మీడియాలో బాగా పబ్లిసిటీ అవుతోందని ఆయన చెప్పారు. విదేశాల్లో ఉన్నట్లు కఠిన శిక్షలు మన దేశంలోనూ ఉంటే డ్రగ్స్ వ్యవహారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన అన్నారు. సినిమాల్లో తాను బిజీగా ఉన్నానని చెప్పారు. ఒకే సమయంలో రెండు పనులు చేయకూడదని చెప్పారు. సినిమాల్లో బిజీగా ఉంటుండడంతో 'మా' పోస్టుకు సరైన న్యాయం చేయలేనని అన్నారు. అందుకే పోటీ చేయట్లేదని తెలిపారు.