Virat Kohli: టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోనున్నాడనే వార్తలపై బీసీసీఐ స్పందన
- రోహిత్ టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టబోతున్నాడంటూ ప్రచారం
- మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్న బీసీసీఐ
- అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని స్పష్టీకరణ
టీ20 ప్రపంచకప్ తర్వాత టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడంటూ ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ టెస్టు జట్టు నాయకత్వ బాధ్యతలను స్వీకరించబోతున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను బీసీసీఐ ఖండించింది.
ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ అన్నారు. ఇదంతా రబ్బిష్ అంటూ ఆయన కొట్టిపారేశారు. మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా ఏదీ జరగబోదని అన్నారు. స్ప్లిట్ కెప్టెన్సీ (టెస్టులకు ఒక కెప్టెన్, లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కు మరొక కెప్టెన్) అంశం గురించి బీసీసీఐ సమావేశం కావడం కానీ... చర్చించడం కానీ జరగలేదని చెప్పారు. అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని తెలిపారు. ధుమాల్ స్పందనతో ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టయింది.