Somu Veerraju: విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా ప్రజలపై అదనపు భారం వేయాలని ప్రయత్నిస్తున్నాయి: సోము వీర్రాజు

Somu Veerraju fires on AP Govt

  • ఏపీలో విద్యుత్ బిల్లుల మోత
  • కరెంటు బిల్లుల రూపంలో షాకిస్తున్నారన్న సోము
  • జగన్ మడమ తిప్పారని విమర్శలు
  • ప్రతిఘటన తప్పదని హెచ్చరిక

ఏపీలో విద్యుత్ బిల్లులు పెరిగిపోవడం పట్ల రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం సమయంలో ఉపాధి లేక అలమటిస్తున్న ప్రజలకు ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో షాకిస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని పాదయాత్రలో మాటిచ్చిన సీఎం జగన్ ఇప్పుడు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఇది మాట తప్పడం, మడమ తిప్పడం కాదా? అని నిలదీశారు. సర్దుబాటు చార్జీల పేరుతో ఐదేళ్ల నాటి ఖర్చుల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు నేడు మడమ తిప్పారని ఆరోపించారు.

ప్రభుత్వం కరెంటు బిల్లులకు, సంక్షేమ పథకాలకు లింకు పెట్టిన నేపథ్యంలో, అధికంగా వస్తున్న బిల్లుల కారణంగా పింఛన్లు కోల్పోతామేమోనని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సోము వీర్రాజు అన్నారు. ఇప్పుడు విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా ప్రభుత్వం బాటలోనే ప్రజలపై అదనపు భారం వేయడానికి ప్రయత్నిస్తున్నాయని, దీన్ని ఏపీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

మీ చేతకాని తనానికి రాష్ట్ర ప్రజలను బాధ్యుల్ని చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోమని, ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News