EngvsInd: ఐపీఎల్ కారణం కాదంటూ.. 5వ టెస్టు రద్దుపై గంగూలీ వివరణ
- టెస్టు రద్దుకు ఐపీఎల్ కారణమంటూ ఆరోపణలు
- ఖండించిన బీసీసీఐ అధ్యక్షుడు
- యోగేష్ పాజిటివ్ తేలడంతో ఆటగాళ్లు భయపడ్డారని వివరణ
రసవత్తరంగా సాగుతున్న భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ అర్థాంతరంగా ముగిసింది. నిర్ణయాత్మక 5వ టెస్టు మ్యాచ్‌ను కరోనా కారణంగా రద్దు చేశారు. అయితే ఈ టెస్టు మ్యాచ్ రద్దులో ఐపీఎల్ పాత్ర కూడా ఉందని వదంతులు వచ్చాయి. ఐపీఎల్ రెండో సెషన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలోనే 5వ టెస్టు మ్యాచ్ రద్దు చేశారని కొందరు వాదించారు. ఈ వదంతులపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చాడు.
‘‘బీసీసీఐ అంత నిర్లక్ష్యమైన బోర్డు కాదు. ఇతర బోర్డులను కూడా చాలా గౌరవిస్తుంది’’ అని గంగూలీ చెప్పాడు. జట్టు ఫిజియో నితిన్ పటేల్ కరోనాతో ఐసోలేషన్‌లో ఉన్నాడని, ఆ సమయంలో జూనియర్ ఫిజియో యోగేష్ పార్మర్ అందరికీ సేవలందించాడని ఆయన వివరించాడు. కొందరు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు కూడా యోగేష్ చేసినట్లు దాదా తెలిపాడు. అవసరమైన వారికి మసాజ్ కూడా చేశాడని, అలాంటి యోగేష్‌కు కరోనా సోకిందని తెలియడంతో ఆటగాళ్లు భయపడ్డారని గంగూలీ స్పష్టంచేశాడు.
ఆటగాళ్లు కరోనా భయంతో ఆడటానికి నిరాకరించారని, వారి భయాన్ని అర్థం చేసుకోవాలని అన్నాడు. ఈ కారణంగానే 5వ టెస్టు రద్దయిందని, ఈ నిర్ణయంలో ఐపీఎల్ ప్రస్తావనే లేదని స్పష్టంచేశాడు.