Chandrababu: కరెంట్ చార్జీల పెంపుతో ప్రజలపై జగన్ పెనుభారం మోపారు: చంద్రబాబు
- ఏపీలో విద్యుత్ బిల్లుల వడ్డన
- మండిపడుతున్న విపక్షాలు
- విద్యుత్ ను అధికరేట్లకు కొంటున్నారన్న చంద్రబాబు
- కమీషన్ల కోసమేనని ఆరోపణ
ఏపీలో ట్రూ అప్ చార్జీల పేరుతో కరెంట్ బిల్లుల వడ్డనపై విపక్షాలు మండిపడుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై జగన్ పెనుభారం మోపారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కమీషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్ ను కొంటున్నారని, ఆ భారం ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. విద్యుత్ ను సరిగా ఉత్పత్తి చేయించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు.
ప్రభుత్వమే మటన్ షాపులు నిర్వహిస్తుందన్న జగన్ మాటలు రాష్ట్రమంతటా హాస్యాస్పదంగా మారాయని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు దోపిడీలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మైనారిటీలు, క్రిస్టియన్ల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
తాజాగా ఎయిడెడ్ కాలేజీల భూములు కాజేయడానికి జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. రేషన్, పెన్షన్లు తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతోందని మండిపడ్డారు. భవిష్యత్తులో గ్రామాల్లో కూడా చెత్త, పారిశుద్ధ్యంపై పన్నువేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.