Kala Venkata Rao: ఏపీ ప్రభుత్వంపై కళా వెంకట్రావు, బొండా ఉమ మండిపాటు
- ఏపీలో విద్యుత్ బిల్లులు పెంచడం సరికాదు
- బిల్లులు కట్టలేక ప్రజలు దీపాలు వాడుతున్నారు
- ఏపీలో 10 లక్షల మంది పింఛనుదారుల పొట్టకొట్టారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు కళా వెంకట్రావు, బొండా ఉమ మండిపడ్డారు. ఏపీలో విద్యుత్ బిల్లులు పెంచడం పట్ల, ఫించనుదారుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజలు దీపాలు వాడుతున్నారని వెంకట్రావు అన్నారు.
విద్యుత్ వంక చూస్తేనే షాక్ కొట్టేలా బిల్లులు వేస్తున్నారని ఆయన చెప్పారు. అప్పట్లో రూ.100 బిల్లు వస్తే ఇప్పుడు వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనలో రెండున్నరేళ్లలోనే రూ.11,611 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆయన అన్నారు.
కాగా, ఏపీలో 10 లక్షల మంది పింఛనుదారుల పొట్టకొట్టారని బొండా ఉమ అన్నారు. ఈనెల పింఛన్లు రాకపోవడంతో వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ఏపీలో తప్పుడు కారణాలను చూపి పింఛన్లు ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. పింఛన్లను రూ.3,000 పెంచుతామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు వృద్ధులను మోసం చేస్తున్నారని ఆయన చెప్పారు. రద్దు చేసిన పింఛన్లు తిరిగి ఇచ్చే వరకూ తమ పార్టీ నిరసనలు తెలుపుతుందని ఆయన అన్నారు.