Afghanistan: పాక్ బోర్డర్ వద్ద వేలాది మంది ఆప్ఘన్లు.. పరిస్థితిని చూపెట్టిన శాటిలైట్ ఫొటోలు!
- ఆప్ఘన్ ను వదిలేందుకు యత్నిస్తున్న వేలాది మంది
- పాక్, ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ బోర్డర్ల వద్ద వేలాదిమంది పడిగాపులు
- సరిహద్దులను మూసేసిన పాకిస్థాన్
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు వశం చేసుకున్న వెంటనే ఆ దేశం నుంచి బయటపడేందుకు వేలాది మంది సర్వశక్తులు ఒడ్డారు. కాబూల్ ఎయిర్ పోర్టు అయితే ఆప్ఘన్ ప్రజలతో నిండిపోయింది. దేశం నుంచి బయటపడితే చాలనే భయం అందరిలో కనిపించింది. అమెరికా విమానానికి వేలాడుతూ వెళ్లి, పైనుంచి జారి కింద పడి చనిపోయిన వారి వీడియోలు ప్రపంచాన్ని కంటతడి పెట్టించాయి. ఇదంతా కాబూల్ విమానాశ్రయం వద్ద మనం చూసిన పరిస్థితి.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్, ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ బోర్డర్ల వద్ద కూడా దయనీయ పరిస్థితులే నెలకొన్నాయి. ఆఫ్ఘన్ నుంచి ఆయా దేశాల్లోకి భూమార్గం ద్వారా వెళ్లేందుకు వేలాది మంది పడిగాపులు కాశారు. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లోని చమన్ బోర్డర్ కు ఎంతోమంది ఆప్ఘన్లు చేరుకున్నారు. వీలైనంత త్వరగా పాక్ భూభాగంలో అడుగు పెట్టేందుకు వారంతా విశ్వయత్నం చేశారు. ఈ ఫొటోలను శాటిలైట్ గత వారం తీసింది.
ఇక ఇతర దేశాల సరిహద్దుల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని వారాలుగా సరిహద్దులకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. చిన్న పిల్లలు, బ్యాగులు, ఇతర లగేజీ వేసుకుని కుటుంబాలకు కుటుంబాలు సరిహద్దులకు చేరుకుంటున్నాయి. వీరంతా వారి ఇళ్లు, ఆస్తులు అన్నింటినీ వదులుకుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నారు. సరిహద్దుల వద్ద తాత్కాలిక టెంటులు వేసుకుని బోర్డర్ దాటేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు, ఆప్ఘన్లు తమ దేశంలో ప్రవేశించకుండా పాక్ బోర్డర్లను మూసేసింది.