Ganesh: హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనంపై ఉత్కంఠ... సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కారు
- హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు
- రివ్యూ పిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం
- తోసిపుచ్చిన ధర్మాసనం
- హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో సర్కారు పిటిషన్
హుస్సేన్ సాగర్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించడం తెలిసిందే. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారైన విగ్రహాలను నిమజ్జనం చేయరాదని, పీఓపీ విగ్రహాలను కేవలం హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన నీటి కుంటల్లోనే నిమజ్జనం చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కృత్రిమ రంగులు, రసాయనాలు లేని గణేశ్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అంగీకరించిన హైకోర్టు.... ఆ విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపున మాత్రం నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. సంజీవయ్య పార్కు, పీవీ మార్గ్ దిశగా నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది.
అయితే, హైకోర్టు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. దాంతో రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.