CM Jagan: ఆరోగ్యశ్రీకి ఎక్కువ బెడ్లు ఇచ్చిన వారికే హెల్త్ హబ్స్ లో ప్రాధాన్యత: సీఎం జగన్
- వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
- హెల్త్ హబ్స్ పై చర్చ
- 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వాలని స్పష్టీకరణ
- హెల్త్ హబ్స్ ఆసుపత్రుల బోర్డుల్లో ప్రభుత్వ ప్రతినిధి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆసుపత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లా కేంద్రాలు, హెల్త్ హబ్స్ అంశంపై ఆయన మాట్లాడుతూ, హెల్త్ హబ్స్ లోని ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీకి ఎక్కువ బెడ్లు ఇచ్చినవారికే హెల్త్ హబ్స్ లో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.
హెల్త్ హబ్స్ ఆసుపత్రుల బోర్డులో ప్రభుత్వం నుంచి ఒక సభ్యుడు ఉంటాడని తెలిపారు. హెల్త్ హబ్స్ ద్వారా రాష్ట్ర వైద్యులకు ఇక్కడే సేవలు అందించే అవకాశం కలుగుతుందని అన్నారు. హెల్త్ హబ్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం రాకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అనారోగ్యం వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే నయం అవుతుందన్న పరిస్థితి కల్పించాలని అధికారులకు నిర్దేశించారు.