Telangana: కడుపునొప్పి తగ్గిస్తానని బొడ్డు చుట్టూ కొరికిన నాటు వైద్యుడు.. చిన్నపేగులు తెగి 2 నెలల చిన్నారి మృతి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
- కడుపునొప్పి రావడంతో నాటువైద్యుడి దగ్గరకు
- చిన్నారిని పీహెచ్ సీకి తరలించిన ఆశా కార్యకర్త
- పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి
- పేగులు తెగినట్టు గుర్తించి ఆగ్రహించిన డాక్టర్లు
నాటువైద్యం రెండు నెలల చిన్నారి ప్రాణం తీసింది. కడుపునొప్పితో ఏడుస్తున్న పసివాడిని తల్లిదండ్రులు నాటువైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా.. అతడు బొడ్డు చుట్టూ కొరికాడు. పసరు మందేసి ఇంటికి పంపించాడు. అయితే, అప్పటికే చిన్నపేగు తెగిన చిన్నారి మరుసటి రోజే కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురంపాడులోని వలస గుత్తికోయగూడెంలో మంగళవారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల బాబు ఉన్నాడు. సోమవారం రాత్రి ఆ చిన్నారి కడుపునొప్పితో బాగా ఏడ్చాడు. దీంతో బాబును గూడెంలోని ఓ నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అతడు బొడ్డు చుట్టూ గట్టిగా కొరికాడు. చిన్నారి మరింత ఏడవడంతో పసరు మందిచ్చి పంపించాడు. నిన్న ఉదయం విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్త.. వెంటనే ఆ చిన్నారిని కరకగూడెం పీహెచ్ సీకి తరలించారు.
పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి కడుపులో చిన్నపేగులు తెగినట్టు గుర్తించారు. డాక్టర్లు నిలదీయగా తల్లిదండ్రులు అసలు విషయం చెప్పారు. దీంతో వారిపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరకడం వల్లే పేగులు తెగిపోయాయని స్పష్టం చేశారు. చికిత్స పొందుతున్న ఆ చిన్నారి పరిస్థితి మరింత విషమించి కన్నుమూశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.