Corona Virus: ఆరు నెలల్లో ఎండెమిక్ దశకు చేరుకోనున్న కరోనా!

Covid may become endemic in six months

  • ఎప్పటికీ ఉండిపోయే దశకు చేరుకుంటుందన్న సుజీత్ సింగ్
  • కోవిడ్ ను ఎదుర్కోవడంలో వ్యాక్సినే కీలకమని వ్యాఖ్య
  • కొత్త వేరియంట్ వస్తే దాన్ని మూడో వేవ్ గా చూడకూడదన్న సుజీత్ సింగ్

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. మూడో వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే (ఎండెమిక్) దశలోకి మారే అవకాశాలున్నాయని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్ర డైరెక్టర్ సుజీత్ సింగ్ తెలిపారు.

ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఆరు నెలల్లో ఇది ఎండెమిక్ దశకు చేరుకుంటుందని అన్నారు. అయితే మరణాల రేటు, సంక్రమణ రేటు నియంత్రణలో ఉన్నట్టయితే మహమ్మారిని కట్టడి చేయవచ్చని చెప్పారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళ కూడా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోందని సుజీత్ సింగ్ తెలిపారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషనే కీలకమని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 75 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారని తెలిపారు. వ్యాక్సిన్ సమర్థత 70 శాతంగా ఉన్నా... దాదాపు 50 కోట్ల మందికి ఇమ్యూనిటీ వచ్చినట్టేనని చెప్పారు.

వ్యాక్సిన్ వల్ల వచ్చిన రోగ నిరోధకశక్తి 70 నుంచి 100 రోజుల తర్వాత క్రమంగా తగ్గుతుందని సుజీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్లు వెలుగుచూడటం లేదని... ఒకవేళ కొత్త వేరియంట్ వచ్చినా దాన్ని థర్డ్ వేవ్ గా భావించకూడదని అన్నారు. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ కావడం కొంత ఆందోళనకు కారణమవుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News