Kadapa District: దిశ యాప్ ద్వారా ఢిల్లీలో ఇబ్బంది పడిన పోరుమామిళ్ల మహిళకు సాయం చేసిన కడప పోలీసులు
- పరీక్ష కోసం ఢిల్లీ వెళ్లిన పోరుమామిళ్ల మహిళ
- ఆటోలో వెళ్తూ ప్రమాదంలో పడినట్టు గుర్తించిన మహిళ
- దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం
- ఇంటికి క్షేమంగా చేరే వరకు బాధ్యత తీసుకున్న పోలీసులు
పరీక్ష కోసం ఢిల్లీ వెళ్లిన కడప మహిళ ప్రమాదంలో చిక్కుకోగా దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న కడప పోలీసులు ఆమెకు సాయం అందించారు. కడప జిల్లాలోని పోరుమామిళ్లకు చెందిన వి.సుభాషిణి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ)లో టీజీటీ పరీక్ష రాసేందుకు ఈ నెల 11న ఢిల్లీ వెళ్లారు.
ఆటోలో ప్రయాణిస్తున్న ఆమె తాను ఇబ్బందుల్లో పడినట్టు గుర్తించారు. దీంతో వెంటనే ఆమె దిశ యాప్ ద్వారా కడప పోలీసులను సంప్రదించారు. ఇక ఆమె నుంచి మెసేజ్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వెంటనే రైల్వే పోలీసులు, ఢిల్లీలోని ఎన్‌జీవోను సంప్రదించారు. ఆ తర్వాత ఆమె క్షేమంగా ఇంటికి చేరుకునేంత వరకు ఆమె బాధ్యతను తీసుకున్నారు.
ఈ ఘటనపై కడప ఎస్పీ మాట్లాడుతూ.. దిశ యాప్‌ను ఉపయోగించుకుని సాయం పొందుతున్న మహిళలను ప్రశంసించారు. కాగా, ఈ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 8న ప్రారంభించారు. ఇప్పటి వరకు 53,75,075 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.