Crime News: రాజు మృతదేహాన్ని మాకు అప్పగించాల్సిందే.. అసలు అది రాజు మృతదేహమేనా?: స్థానికులు
- ముఖం ఛిద్రమైపోయి ఉంది
- ఆ మృతదేహం రాజుదేనని అధికారికంగా నిర్ధారించాలి
- పాపను అత్యాచారం చేసిన ఇంట్లోనే రాజుని పాతిపెడతాం
- ప్రాణాలతో మాకు రాజుని అప్పగిస్తే బాగుండేది
సైదాబాద్ ఘటన నిందితుడు రాజు మృతదేహాన్ని గుర్తించామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైందని చెప్పారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కూడా అధికారికంగా ప్రకటన చేశారు. రాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాక తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. అయితే, పోలీసుల తీరుపై సైదాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా మృతుడి మృతదేహాన్ని తమకు చూపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అది అసలు రాజు మృతదేహమేనా? అంటూ మీడియా ముందు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయింది రాజేనని తమకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదని అన్నారు. ఈ ప్రభుత్వం తన చర్యల ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకుందని ప్రశ్నించారు.
నిందితుడిని పట్టుకుని త్వరగా ఉరిశిక్ష పడేలా చేస్తే బాగుండేదని చెప్పారు. లేదంటే ఎన్‌కౌంటర్ చేసి ఆ మృతదేహాన్ని తమకు చూపించినా బాగుండేదని అన్నారు. రైల్వే ట్రాక్‌పై ముఖం ఛిద్రమై ఉన్న మృతదేహాన్ని చూపించి, అదే రాజు మృతదేహం అంటుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. పోలీసులు చూపెడుతున్న మృతదేహాన్ని తమకు అప్పగించాల్సిందేనని ఆందోళనకు దిగారు.
రాజు మృతదేహాన్ని కోర్టు సమక్షంలో అధికారికంగా నిర్ధారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ మృగాడు ఏ ఇంట్లో అత్యాచారం చేశాడో అదే ఇంట్లో అతడి మృతదేహాన్ని కోసి, పాతిపెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీకి రాజుని ప్రాణాలతో పట్టుకొచ్చి, ఇక్కడే ఉరి తీస్తే బాగుండేదని అన్నారు.