Sonu Sood: సోనూసూద్ ఇంట్లో మళ్లీ ఐటీ దాడులు
- ముంబైలోని నివాసంలో ఐటీ అధికారుల సోదాలు
- లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూ ఒప్పందం
- ఆయనపై పన్ను ఎగవేశారన్న ఆరోపణలు
ప్రముఖ నటుడు సోనూసూద్ పై ఆదాయ పన్ను శాఖ అధికారులు మరోసారి దాడులు చేశారు. నిన్న ఆయన ఆఫీసులు, నివాసంలో సోదాలు చేసిన అధికారులు.. ఇవాళ ముంబైలోని ఆయన నివాసానికి మరోసారి వెళ్లి తనిఖీలు చేపట్టారు. లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూ చేసుకున్న ఒప్పందాలపై అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. డీల్ కు సంబంధించి పన్ను ఎగవేశారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపైనే దర్యాప్తు సాగుతోందని ఓ అధికారి చెప్పారు. ఈ తనిఖీలు కేవలం ‘సర్వే’ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
నిన్న ముంబైలోని జుహులో ఉన్న సోనూ స్వచ్ఛంద సంస్థతో పాటు ఆరు ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులు, ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. నిన్న అర్ధరాత్రి దాకా తనిఖీలను కొనసాగించారు. 20 గంటల పాటు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, ప్రతిపక్షాలు ఈ దాడులపై మండిపడుతున్నాయి. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూకు గుర్తింపు రావడం వల్లే ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం సోనూను అంబాసిడర్ గా నియమించుకుంది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.