Saidabad: ఆటోను దొంగిలించి పారిపోయే యత్నం కూడా చేసిన సైదాబాద్ నిందితుడు రాజు!
- పారిపోయే ప్రయత్నంలో ఎల్బీనగర్‌లో ఆటో చోరీకి యత్నం
- డ్రైవర్‌కు, రాజుకు మధ్య గొడవ
- ఆ తర్వాత బస్సెక్కి వెళ్లిపోయిన నిందితుడు
సైదాబాద్ హత్యాచార కేసు నిందితుడు రాజు గురించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నేరానికి పాల్పడిన తర్వాత రాజు ఓ ఆటోను దొంగిలించి అందులో పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే, డ్రైవర్ గమనించడంతో పథకం బెడిసికొట్టింది. ఎల్బీనగర్‌లో ఓ ఆటోను దొంగిలించేందుకు రాజు ప్రయత్నించాడు.
అయితే, టీ తాగేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్ తిరిగి వస్తూ ఆటోను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న రాజును గమనించి ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆటో డ్రైవర్‌పై రాజు దాడికి కూడా యత్నించాడు. గమనించిన ఇతర ఆటో డ్రైవర్లు, స్థానికులు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించేశారు. ఆ తర్వాత రాజు ప్రధాన చౌరస్తాలోని ఓ హోటల్ వైపుగా వెళ్లి అక్కడ బస్సు ఎక్కాడు. నంబరు ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు.
రాజు గురించి అప్పటికే కలకలం రేగినా అతడు ఎలా ఉంటాడన్న విషయంలో ఎవరికీ అవగాహన లేకపోవడంతో తప్పించుకోగలిగాడని పోలీసులు చెబుతున్నారు. రాజుపై గతంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఆటో చోరీ కేసు కూడా నమోదైందని పోలీసులు తెలిపారు. రాజు ఆత్మహత్యపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి వేలాది సీసీ టీవీ కెమెరాలు పరిశీలించామని, శాస్త్రీయంగా పరిశోధించి ఆధారాలు సేకరిస్తూ వచ్చామని, అతడి ఆచూకీ తమకు దాదాపు తెలుస్తోందనగా, అతడు ఆత్మహత్య చేసుకున్న విషయం తమకు తెలిసిందని పేర్కొన్నారు.