Health: డయాలిసిస్​ కు ఇక చెక్​.. ఇదిగో ఒంట్లో పట్టేంత కృత్రిమ కిడ్నీ వచ్చేస్తోంది!

US Scientists Developed Bio Artificial Kidney To Check Dialysis

  • ద కిడ్నీ ప్రాజెక్ట్ తో అమెరికా శాస్త్రవేత్తల రూపకల్పన
  • విజయవంతంగా పరీక్షించిన పరిశోధకులు
  • క్లినికల్ ట్రయల్స్ కోసం మరింతగా అభివృద్ధి
  • రూ.4.77 కోట్ల ప్రైజ్ గెలుచుకున్న పరిశోధన

ఒంట్లోని మలినాలు బయటికెళ్లిపోవాలన్నా, అణువణువూ ప్రవహించే రక్తం శుద్ధి కావాలన్నా మూత్రపిండాలు ఎంత ముఖ్యమో తెలిసే ఉంటుంది. అలాంటి మూత్రపిండాలు పాడైపోతే.. జీవితాంతం రక్త శుద్ధి కోసం డయాలిసిస్ చేయించుకోవాల్సిందే. డయాలిసిస్ చేయించుకున్నా ఎంత కాలం బతుకుతారో కూడా తెలియదు. సరే ఇవన్నీ ఎందుకు.. కిడ్నీ మార్చుకుందామంటే దానికి ఎన్నెన్నో సవాళ్లు. మరి, దీనికి పూర్తి పరిష్కారం లేదా? అంటే.. తమ దగ్గర ఉందంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో శాస్త్రవేత్తలు.

డయాలిసిస్ కు శాశ్వత పరిష్కారం కోసం వారు ‘ద కిడ్నీ ప్రాజెక్ట్’ పేరుతో ఓ హైబ్రిడ్ మూత్రపిండాన్ని (కృత్రిమ కిడ్నీ) తయారు చేశారు. చేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజులోనే ఉండే ఈ బయోఆర్టిఫిషియల్ కిడ్నీని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. శరీరం తిరస్కరించకుండా, ఎలాంటి బ్యాటరీల అవసరం లేకుండా, మందులు వాడకుండానే ఈ హైబ్రిడ్ కిడ్నీ పనిచేస్తుంది. రక్తంలోని మలినాలు వేరు చేసి శుద్ధి చేయడమే కాకుండా రక్తపోటు, ఒంట్లోని లవణాలను నియంత్రణనూ చూసుకుంటుంది.


ఈ పరికరాన్ని రెండు ప్రధాన భాగాలుగా శాస్త్రవేత్తలు రూపొందించారు. రక్తాన్ని వడబోసే ‘హీమోఫిల్టర్’ను సిలికాన్ సెమికండక్టర్ పొరలతో తయారు చేశారు. ఇది రక్తంలోని వ్యర్థాలను వేరు చేస్తుంది. మూత్రపిండాల్లో కీలకమైన రీనల్ ట్యూబ్యూల్స్ తో ‘బయోరియాక్టర్’కు రూపమిచ్చారు. ఇది శరీరంలోని నీటి స్థాయులు, లవణాల సమతుల్యత, మూత్ర పిండాలు చేసే ఇతర కీలక ప్రక్రియలను నిర్వహిస్తుంది. దీనిని ఇంప్లాంట్ చేసిన వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ కృత్రిమ కిడ్నీపై దాడి చేయకుండా.. ఆ కిడ్నీలోని ఈ రెండు పొరలు కాపాడుతాయి.

కృత్రిమ కిడ్నీని రోగిలోని రెండు ప్రధాన ధమనులకు అనుసంధానం చేస్తారు. శుద్ధి చేసేందుకు రక్తాన్ని తీసుకొచ్చేలా ఒక ధమనికి, శుద్ధి చేసిన రక్తం శరీరంలోకి తిరిగి ప్రసరణ జరిగేలా మరో ధమనికి కృత్రిమ కిడ్నీ/హైబ్రిడ్ కిడ్నీని కనెక్ట్ చేస్తారు. రక్తం నుంచి వేరైన వ్యర్థాలను ఈ కిడ్నీ మూత్రాశయంలోకి పంపుతుంది. ఎలాంటి బ్యాటరీలు అవసరం లేకుండా రక్తం ప్రవహించే వేగం లేదా రక్తపోటుతోనే ఇది పనిచేస్తుంది.

దీని సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఇటీవలే కఠినమైన పరీక్షలు చేశారు. టెస్ట్ లో కిడ్నీ అన్ని ఒత్తిళ్లను తట్టుకుందని, ప్రిక్లినికల్ టెస్టింగ్, క్లినికల్ ట్రయల్స్ కోసం ఈ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేస్తామని కిడ్నీ ప్రాజెక్ట్ కు నేతృత్వం వహిస్తున్న షువో రాయ్ చెప్పారు. కిడ్నీఎక్స్ అనే సంస్థ అందిస్తున్న ఫేజ్ 1 ఆర్టిఫిషియల్ కిడ్నీ ప్రైజ్ లో భాగంగా ‘ద కిడ్నీ ప్రాజెక్ట్’ సుమారు రూ.4.77 కోట్లు (6.5 లక్షల డాలర్లు) గెలుచుకుంది.

  • Loading...

More Telugu News