Mohammad Siraj: టీ20 ప్రపంచకప్ జట్టులో లేకపోవడంపై సిరాజ్ స్పందన
- అది తన కల అన్న హైదరాబాదీ పేసర్
- సెలక్షన్ తన చేతిలో లేదని కామెంట్
- జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే లక్ష్యం : సిరాజ్
టీ20 ప్రపంచ కప్ ఆడే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై భారత పేసర్ మహ్మద్ సిరాజ్ స్పందించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని, జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పాడీ హైదరాబాదీ పేసర్. అక్టోబరు 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ జట్టులో మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. సీనియర్ పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లనే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సిరాజ్.. తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ఈ ప్రపంచకప్ ఆడటం తన కల అని సిరాజ్ చెప్పాడు. అయితే, సెలక్షన్ నా చేతిలో ఉండదు కదా? అంటూ నిట్టూర్చాడు. అయితే ఒక్కసారి జట్టులో చోటు దక్కకపోతే కథ ముగిసినట్లు కాదని, భవిష్యత్తులో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించడమే తన లక్ష్యమని సిరాజ్ స్పష్టంచేశాడు.
తనకు దక్కే అవకాశాలను సద్వినియోగం చేసుకొని, అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించాడు.