Puduchery: ప్రభుత్వ ఉద్యోగులు టీకా తీసుకోకపోతే జీతం కట్!: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ వార్నింగ్
- టీకా ఆవశ్యకత వివరిస్తూ వాయుసేన ర్యాలీ
- జెండా ఊపి ప్రారంభించిన తమిళి సై సౌందరరాజన్
- దీపావళి బోనస్ కూడా ఇవ్వమన్న లెఫ్టినెంట్ గవర్నర్
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు అంటున్నారు. కానీ కొందరు ఏవేవో భయాలు పెట్టుకొని వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. ఇలాంటి వారు టీకా తీసుకునేలా చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పుదుచ్చేరిలో కరోనా టీకా తీసుకోవడానికి ఇష్టపడని ప్రభుత్వ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ షాకిచ్చారు. వీరు గనుక టీకా తీసుకోలేదంటే జీతంతోపాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వబోమని ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ రెండూ లభిస్తాయని తెలిపారు.
గురువారం నాడు కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తూ భారత వాయుసేనకు చెందిన కొందరు అధికారులు సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. టీకా ఆవశ్యకతను వివరించే ఈ ర్యాలీ ద్వారా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సైనికులు పిలుపునిచ్చారు.
రాజ్ నివాస్ ఆవరణ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. దీన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ జెండా ఊపి ఆరంభించారు. ఈ సందర్భంగానే టీకా తీసుకున్న వారికే జీతం, దీపావళి బోనస్ లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.