Raju: రాజు మృతిపై జ్యుడిషియల్ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
- హత్యాచారం కేసు నిందితుడు రాజు మృతి
- రైలు పట్టాలపై శవమై కనిపించిన రాజు
- ఆత్మహత్యేనంటున్న పోలీసులు
- చంపేశారంటున్న పౌరహక్కుల సంఘం
బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకుడైన పల్లకొండ రాజు చివరికి స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై శవమై కనిపించాడు. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా, రాజు మరణంపై అనుమానాలున్నాయంటూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రాజును చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ వ్యాజ్యంపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు.... రాజు మృతిపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. వరంగల్ మూడో మెట్రోపాలిటన్ జడ్జికి జ్యుడిషియల్ విచారణ బాధ్యతలు అప్పగించింది. పోస్టుమార్టం వీడియోలను ఆ జడ్జికి శనివారం రాత్రి 8 గంటల్లోగా అందించాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక రూపొందించి 4 వారాల్లో సమర్పించాలని సదరు జడ్జికి స్పష్టం చేసింది.