Akhilesh Yadav: పోలింగ్ బూత్ లలో బీజేపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది: అఖిలేశ్ యాదవ్
- ఎన్నికల సమయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
- బీజేపీ అనైతిక చర్యలను అడ్డుకోవాలి
- బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల సందడి మొదలవుతోంది. బీజేపీపై సమాజ్ వాది పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. పోలింగ్ బూత్ లలో బీజేపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎస్పీ కార్యకర్తలకు ఇదొక పరీక్షా సమయమని అన్నారు. బీజేపీ అప్రజాస్వామిక, అనైతిక చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వారి ఘనతగా చెప్పుకుంటోందని అన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని... ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని దుయ్యబట్టారు.