Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ను బయట నుంచి కంట్రోల్ చేయలేం: పాక్ ప్రధాని

Afghanistan could not be controlled from outside says Imran Khan
  • తజికిస్థాన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో-సీహెచ్‌ఎస్‌లో పాల్గొన్న పాక్
  • పరిశీలక పాత్రకే పరిమితమైన ఆఫ్ఘన్
  • తమ మద్దతు కొనసాగిస్తామన్న ఇమ్రాన్ ఖాన్
ఆఫ్ఘనిస్థాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. తజికిస్థాన్ రాజధాని దుషాంబే వేదికగా జరిగిన 21వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ (ఎస్‌సీవో-సీహెచ్ఎస్) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ భేటీలో భారత్, చైనా, పాకిస్థాన్, రష్యా, కజికిస్థాన్, కిర్జికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ దేశాధినేతలు పాల్గొన్నారు.

ఇటీవల తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్థాన్ ఈ సమావేశంలో పరిశీలక పాత్ర వహించింది. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ఆఫ్ఘన్‌ను బయటి నుంచి నియంత్రించడం అసంభవమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆఫ్ఘనిస్థాన్‌కు విదేశీ సహకారం అవసరమని చెప్పారు.

ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రధానంగా విదేశీ సహకారంపైనే ఆధారపడి ఉందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఇమ్రాన్ అన్నారు. అదే సమయంలో తాలిబన్లు కూడా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు.

సుస్థిరమైన ఆఫ్ఘనిస్థాన్‌పై తాము ఆసక్తిగా ఉన్నామని ఇమ్రాన్ చెప్పారు. అలాగే ఆఫ్ఘన్‌కు తమ మద్దతు ఎప్పటిలాగే కొనసాగుతుందని అన్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా తమ ప్రభుత్వాన్ని కూడా వీరు ప్రకటించారు. తాలిబన్ల విజయంలో పాకిస్థాన్ పాత్ర చాలా ఉందని వదంతులు కూడా వినిపించిన విషయం తెలిసిందే.
Afghanistan
Taliban
Pakistan
Imran Khan
SCO-CHS

More Telugu News