Narendra Modi: తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి: ప్రధాని మోదీ పిలుపు
- తజికిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశం
- వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ
- ఆఫ్ఘన్ పరిస్థితులపై కూడా స్పందన
ప్రపంచంలో పెరుగుతున్న తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని భారత ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తజికిస్థాన్ రాజధాని దుషాంబే వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌సీవోలో కొత్తగా చేరుతున్న ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఖతర్ దేశాలకు స్వాగతం పలికారు.
అనంతరం ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఈ దేశంలోని పరిస్థితులు టెర్రరిజాన్ని బలపరిచేలా ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాల మధ్య శాంతి స్థాపనకు ఉగ్రవాదం పెద్ద అడ్డంకిగా మారిందని తెలిపారు. ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వంలో చైనా, పాకిస్థాన్ పాలుపంచుకుంటున్నాయని మోదీ ఆరోపించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాము ఎన్నో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు లష్కరే తాయిబా, జైషే మహమ్మద్ వంటివి ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులను ఉపయోగించుకుని భారత్‌లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌పై ఈ ఉగ్రవాద సంస్థలు దృష్టి పెట్టే ప్రమాదం ఉందన్నారు.