Afghanistan: కాబూల్‌లో దారుణ పరిస్థితులు.. చిన్నారుల ఆకలి తీర్చేందుకు గృహోపకరణాల అమ్మకం!
- కాబూల్‌లో తలకిందులైన ప్రజల ఆర్థిక పరిస్థితి
- ఉపాధి కరవై తిండికి అల్లాడిపోతున్న ప్రజలు
- గృహోపకరణాల విక్రయాలతో కిటకిటలాడుతున్న కాబూల్ వీధులు
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. తాలిబన్ల నుంచి కష్టాలు తప్పవని భావించిన కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి పారిపోగా, మరికొందరు విధిలేక అక్కడే ఉంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
తాలిబన్ల ఆక్రమణ తర్వాత రాజధాని కాబూల్‌లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఉపాధి లేక, చేతిలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట గడిచేదెలానో తెలియక అల్లాడిపోతున్నారు. కన్నబిడ్డలకు కడుపారా భోజనం పెట్టలేక విలవిల్లాడుతున్నారు. దీంతో మరోమార్గంలేక గృహోపకరణాలను అమ్ముకుంటున్నారు.
సోఫా, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, బీరువా.. ఇలా అమ్మకానికి అనువైన వస్తువులను వీధుల్లోకి తీసుకొచ్చి అతి తక్కువ ధరకే తెగనమ్ముకుంటున్నారు. వచ్చిన డబ్బులతో పిల్లలకు ఆహార పదార్థాలు కొని, వండిపెడుతున్నారు. ఇలా విక్రయించేవారితో కాబూల్ వీధులు రద్దీగా మారాయి. తాను రూ. 25 వేల అఫ్ఘనీలు పెట్టి కొనుగోలు చేసిన ఫ్రిడ్జ్‌ను ఇప్పుడు గత్యంతరం లేక రూ. 5 వేల అఫ్ఘనీలకే విక్రయించినట్టు స్థానిక దుకాణదారుడు ఒకరు చెప్పడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.