Kishan Reddy: టీటీడీ బోర్డుకు నేను ఎవరినీ సిఫారసు చేయలేదు: సీఎం జగన్ కు కిషన్ రెడ్డి లేఖ
- ఇటీవలే భారీ స్థాయిలో టీటీడీ కొత్త బోర్డు నియామకం
- ఓ సభ్యుడ్ని కిషన్ రెడ్డి రికమెండ్ చేశారంటూ ప్రచారం
- వై.రవిప్రసాద్ పేరును తాను సిఫారసు చేయలేదన్న కిషన్ రెడ్డి
- తన మంత్రిత్వ శాఖకు కూడా సంబంధంలేదని స్పష్టీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీస్థాయిలో పాలకమండలిని ఏర్పాటు చేయడంపై ఓవైపు టీడీపీ విమర్శలు గుప్పిస్తుండగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీటీడీ బోర్డులో ఎవరి ఎంపికలోనూ తన ప్రమేయం లేదని ఆ లేఖలో కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడు వై.రవిప్రసాద్ పేరును తాను సిఫారసు చేయలేదని, టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వాలని తాను ఎవరినీ కోరలేదని వెల్లడించారు.
ఈ అంశంలో వ్యక్తిగతంగానూ, తన మంత్రిత్వ శాఖ పరంగానూ ఎలాంటి జోక్యం లేదని పేర్కొన్నారు. తన సిఫారసు మేరకే వై.రవిప్రసాద్ ను టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు వస్తున్న వార్తలపై కిషన్ రెడ్డి పైవిధంగా స్పందించారు. మీడియాలో తనపై వస్తున్న వార్తల్లో నిజంలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ స్పందించాలని, తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.