Nandita Banna: మిస్ సింగపూర్ గా తెలుగమ్మాయి నందిత
- అందాల పోటీల్లో సత్తా చాటిన నందిత
- మిస్ యూనివర్స్ సింగపూర్-2021 విజేత
- పాతికేళ్ల కిందట సింగపూర్ లో స్థిరపడిన నందిత కుటుంబం
- స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా
తెలుగు సంతతి యువతి నందితా బన్నా సింగపూర్ అందాల పోటీల్లో సత్తా చాటింది. ఏపీలో మూలాలు కలిగిన నందిత మిస్ యూనివర్స్ సింగపూర్-2021 అందాల కిరీటం గెలుచుకుంది. సింగపూర్ సిటీలోని నేషనల్ మ్యూజియంలో ఈ పోటీలు నిర్వహించారు. అ పోటీలో నందిత ప్రథమస్థానంలో నిలిచింది.
అందాల పోటీలో విజేతగా నిలిచిన అనంతరం నందిత మాట్లాడుతూ, సింగపూర్ లో జాతివివక్ష వంటి అంశాలను ఎత్తి చూపాలని భావిస్తున్నానని వెల్లడించింది. ఈ ఏడాది ఇజ్రాయెల్ లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో నందిత సింగపూర్ కు ప్రాతినిధ్యం వహించనుంది.
నందిత వయసు 21 సంవత్సరాలు కాగా, ఆమె సింగపూర్ లోనే పుట్టి పెరిగింది. ఆమె కుటుంబం పాతికేళ్ల కిందటే సింగపూర్ లో స్థిరపడింది. నందిత తల్లిదండ్రుల పేర్లు మాధురి, గోవర్ధన్. వారి స్వస్థలం శ్రీకాకుళం.
నందిత ప్రస్తుతం సింగపూర్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్ మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సు అభ్యసిస్తోంది. కోడింగ్ లోనూ అభిరుచి కలిగిన నందితకు స్కేటింగ్, కుకింగ్, డ్యాన్స్ లోనూ ప్రావీణ్యం ఉంది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేస్తున్న నందితకు సామాజిక స్పృహ ఉంది. ఆమె కేర్ కార్నర్ సింగపూర్ అనే స్వచ్ఛంద సంస్థలో వలంటీరుగా పనిచేస్తోంది.