MPTC: ఏపీలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- 515 జడ్పీటీసీ స్థానాల్లో 2,058 మంది పోటీ
- 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
- మరికొన్ని గంటల్లో తేలిపోనున్న అభ్యర్థుల భవితవ్యం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 515 జడ్పీటీసీ స్థానాల్లో 2,058 మంది పోటీలో ఉన్నారు. అలాగే, 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 375 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక, పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7,220 స్థానాల్లో 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏప్రిల్ 8న ఎన్నికలు జరగ్గా మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేసిన అధికారులు మొత్తం 13 జిల్లాల్లో 209 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11,227 మంది సూపర్ వైజర్లు, 31,133 మంది సిబ్బందిని నియమించారు. అర్ధరాత్రి దాటినా లెక్కింపు ప్రక్రియను పూర్తిచేసి విజేతలను ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఫిర్యాదు స్వీకరణ కోసం 0866 2466877 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.