Cricket: ఆ మూడూ కొట్టేస్తే.. రోహిత్​ శర్మ ఖాతాలో మరో రికార్డ్​!

Rohit Just 3 Sixes Away To Scribe Highest Hit Indian Cricketer

  • టీ20ల్లో 397 సిక్సర్లు బాదిన హిట్ మ్యాన్
  • మరో మూడు కొట్టేస్తే 400 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్ గా రికార్డ్
  • 1042 సిక్సర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో గేల్

రోహిత్ శర్మ.. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదినా, అలవోకగా సిక్సర్లు బాదాలన్నా అతడికే చెల్లింది. ఇప్పుడీ హిట్ మ్యాన్ మరో రికార్డుకు అతి చేరువగా వచ్చేశాడు. మరో మూడు సిక్సర్లు బాదేస్తే టీ20ల్లో 400 సిక్సర్లు బాదిన మొదటి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు. కరోనా కలకలంతో వాయిదా పడిన ఐపీఎల్ 14వ ఎడిషన్ రెండో దశ ఇవాళ్టి నుంచి మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే.

రెండో దశ మొదటి మ్యాచ్ లో ముంబైతో చెన్నై తలపడనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ ఆ మూడు సిక్సర్లూ బాదేస్తే రికార్డును తన పేరిట రాసేసుకుంటాడు మరి. ఇప్పటిదాకా రోహిత్ ఖాతాలో 397 సిక్సర్లున్నాయి. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 1042 సిక్సర్లు బాది మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో విండీస్ వీరులు 755 సిక్సర్లతో పొలార్డ్, 509 సిక్సులతో ఆండ్రీ రసెల్ ఉన్నారు. ఈ జాబితాలో ప్రస్తుతం రోహిత్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఆ మూడు సిక్సర్లూ బాదేస్తే ఏడోస్థానానికి వచ్చేస్తాడు.

ఇక భారత ఆటగాళ్ల విషయంలో రోహిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత సురేశ్ రైనా 324 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 315 సిక్సర్లు, ధోనీ 303 సిక్సర్లు బాదారు. కాగా, ఐపీఎల్ 14 సీజన్ లో 14 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. చెన్నై, బెంగళూరు, ముంబైలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News