MPTC: ఏపీలో పరిషత్ ఎన్నికల తాజా ఫలితాలు ఇవిగో!
- ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఓట్ల లెక్కింపు
- వైసీపీ ఆధిక్యం సుస్పష్టం
- ఇప్పటివరకు వైసీపీకి 4,150 ఎంపీటీసీ స్థానాలు
- 187 జడ్పీటీసీల్లో జయభేరి
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 9,589 ఎంపీటీసీ స్థానాలకు, 641 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టగా... ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం వైసీపీ 4,150 ఎంపీటీసీ స్థానాలు, 187 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 286 ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంది. టీడీపీ ఖాతాలో ఒక్క జడ్పీటీసీ స్థానం కూడా లేదు. ఇక జనసేన 26 ఎంపీటీసీలు, బీజేపీ 14 ఎంపీటీసీలు, ఇతరులు 79 ఎంపీటీసీలు కైవసం చేసుకున్నారు.
ఈ ఫలితాలపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనం ఈ ఫలితాలు అని వెల్లడించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన టీడీపీకి లేదని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లోనూ ఓడిపోతామని తెలిసే టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మరో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, వైసీపీకి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.