India: రష్యా, అమెరికా పర్యటనకు భారత ఆర్మీ చీఫ్
- సీడీఎస్ హోదాలో తొలి విదేశీ పర్యటన
- షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల సీడీఎస్ స్థాయి అధికారుల సమావేశం
- చైనా, పాకిస్థాన్ కూడా ఈ బృందంలోనే
భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీడీఎస్) పదవిని చేపట్టిన తర్వాత రావత్ వెళుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ పర్యటనలో ఆయన అమెరికా, రష్యా దేశాలకు వెళుతున్నట్లు తెలుస్తోంది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్యదేశాల సీడీఎస్ స్థాయి అధికారుల సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ తర్వాత రష్యాలో జరిగే ఎస్సీవో శాంతి మిషన్ డ్రిల్స్‌లో భారత దళాలు పాలుపంచుకుంటాయి. భారత ఆర్మీ, వాయుసేనలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనికోసం వచ్చే వారమే రష్యా పర్యటనకు బిపిన్ రావత్ వెళ్లనున్నట్లు సమాచారం.
రష్యా నుంచి తిరిగొచ్చిన వెంటనే ఆయన అమెరికా బయలుదేరతారు. అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. గడిచిన కొన్నేళ్లలో భారత్-అమెరికా మధ్య మిలటరీ బంధాలు బలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల దళాలు కలిసి పలు ఆర్మీ విన్యాసాల్లో కూడా పాలుపంచుకున్నాయి.
కాగా, కొంతకాలంగా దేశంలోని త్రివిధ దళాల మధ్య సమన్వయం తీసుకొచ్చే బాధ్యతలతో బిపిన్ రావత్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనలకు వెళ్లకుండా వాయిదాలు వేస్తూ వచ్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.