Gautam Gambhir: అకస్మాత్తుగా కోహ్లీ చేసిన ప్రకటన సరికాదు: గంభీర్ విమర్శలు
- బెంగళూరు కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేశాడు
- ఐపీఎల్-2021 ముగిసిన తర్వాత చేస్తే బాగుండేది
- ఇప్పుడు అనవసరంగా ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది
- కప్‌ను ఓ వ్యక్తి కోసం కాకుండా ఫ్రాంఛైజీ కోసం గెలవాలి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ హోదా నుంచి వైదొలుగుతున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2021 ముగిసిన తర్వాత కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుండేదని ఆయన అన్నాడు.
కోహ్లీ ఒక్కసారిగా చేసిన ఈ ప్రకటన తనను కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని గంభీర్ చెప్పాడు. కోహ్లీ ఆ ప్రకటన చేయడానికి ఇది సరైన సమయం కాదని, ఈ ప్రకటన వల్ల అనవసరంగా ఆటగాళ్లపై ఒత్తిడిని పెరుగుతుందని చెప్పాడు. ఈ సారి వాళ్లు మంచి పొజిషన్లో ఉన్నారని, కోహ్లీ ఈ సీజన్ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథిగా ఉండడు కాబట్టి ఎలాగైన కప్ గెలవాలనే ఆశయం వారిపై అధిక భారాన్ని మోపుతుందని అభిప్రాయపడ్డాడు.
కప్‌ను ఓ వ్యక్తి కోసం కాకుండా ఫ్రాంఛైజీ కోసం గెలవాలని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కోహ్లీ గుర్తుపెట్టుకుంటే తన నిర్ణయాన్ని ఇంత త్వరగా ప్రకటించే వాడు కాదని చెప్పాడు. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడం, ఆటకు టాటా చెప్పడం అనేవి రెండు వేర్వేరు నిర్ణయాలని ఆయన అన్నాడు. కోహ్లీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇది ఆటగాళ్లను భావోద్వేగానికి గురిచేసే సమయమని చెప్పాడు.