Vijayashanti: చాక్​పీస్​లు కొనేందుకు కూడా తమ జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోందని హెచ్ఎంలు అంటున్నారు: విజ‌య‌శాంతి

vijay shanti slams kcr

  • ప్రభుత్వ  బ‌డుల్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇట్టే అర్థ‌మవుతుంది
  • కరోనా  ప్ర‌భావంతో మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలను తెరిచారు
  • స్కూళ్లలో తలుపులు, కిటికీలు పాడ‌య్యాయి
  • స్లాబులు పెచ్చులూడి పడి స్టూడెంట్లకు, టీచర్లకు గాయాలవుతున్నాయి
  • ఏ స్కూల్లోనూ హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్స్ కొనే దుస్థితి లేదు

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని దుస్థితిపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మండిప‌డ్డారు. 'కరోనా ప్ర‌భావంతో మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలు 18 నెలల తర్వాత సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా రీ ఓపెన్ అయ్యాయి. చాలా రోజులు మూసి ఉండడం వల్ల స్కూళ్లలో తలుపులు, కిటికీలు పాడవడమే కాకుండా స్లాబులు పెచ్చులూడి పడి స్టూడెంట్లకు, టీచర్లకు గాయాలవుతున్నాయి.

పాఠశాలల్లో కరోనా రూల్స్ కఠినంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి, ఆఫీసర్లు చెప్పారే గానీ ఎక్కడా అమలు కావడం లేదు. మెయింటనెన్స్ గ్రాంట్ రాక ఏ స్కూల్లోనూ హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్స్ కొనే పరిస్థితి లేదు. కనీసం సబ్బులనూ అందుబాటులో ఉంచట్లేదు' అని విజ‌య శాంతి విమ‌ర్శించారు.

'చాక్‌పీసులు, రిజిస్టర్లు కొనేందుకు కూడా తమ జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోందని హెచ్ఎంలు అంటున్నారంటే ప్రభుత్వ  బ‌డుల్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇట్టే అర్థ‌మవుతుంది. గతంలో సీఎం కేసీఆర్ కేజీ టూ పీజీ విద్యను అందిస్తానని చెప్పి ఆ విషయాన్ని గాలికొదిలేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26,067 గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూల్స్ ఉన్నాయి. విద్యా సంవత్సరం మొదలై  4 నెలలైనా సర్కారు నుంచి గ్రాంట్ ఇవ్వకుండా జాప్యం చేయడం సిగ్గుచేటు. ఇక స్కూళ్లకిచ్చిన కరెంట్ కనెక్షన్లు కమర్షియల్ కేటగిరీ కింద చేర్చడంతో బిల్లులు భారీగా రావడం గ్రాంటు నిధులు విడుదల కాకుండా ఉండడంతో బకాయిలు పడ్డాయి. మరి కొన్నిచోట్ల బిల్లులు కట్టలేదని కనెక్షన్ తొలగిస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించే తీరు చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత చిన్నచూపు కనబరుస్తుందో అర్థ‌మవుతుంది' అని  విజ‌య శాంతి విమ‌ర్శించారు.
 
'ఓట్ల కోసం ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పే ప్రభుత్వం పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భారీగా ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్...  రాష్ట్రవ్యాప్తంగా 28,200 మంది స్కావెంజర్లకు జీతాలు ఇవ్వలేక వారిని తొలగించి స్కూళ్లలో పారిశుద్ధ్య పనులను లోకల్ బాడీలకు అప్పగించారు. పట్టణాలు, గ్రామాల్లోని పారిశుద్ధ్య పనులే తలకు మించిన భారం కావడంతో మున్సిపల్, పంచాయతీ శానిటరీ వర్కర్లు స్కూళ్ల దిక్కు చూడడమే లేదు.

రాష్ట్రంలో వేలకొద్దీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తూ రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోంది. గతంలో పనిచేసిన విద్యావలంటీర్లను ప్రభుత్వం తొలగించడంతో ఇంకా దారుణమైన పరిస్థితి దాపురించింది. దీంతో ఆయా చోట్ల క్లాసులు జరగక, విద్యాకమిటీల ఆధ్వర్యంలో ప్రైవేట్గా వీవీలను పెట్టుకుని విద్యార్థులకు విద్యను అందించాలని పేద తల్లిదండ్రులను డబ్బులు అడుగుతుంటే... వారు ఇవ్వలేక ఉపాధ్యాయులపై మండిపడ్డ సంఘటనలు జరుగుతున్నాయి.

దీంతో చేసేదేమీ లేక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై టీఆర్ఎస్ ప్రభుత్వం అశ్రద్ధ‌ను వీడి, అన్ని సౌకర్యాలనూ కల్పించి, పేదవారికి విద్యను దూరం చేయకుండా చేస్తే మంచిది' అని విజ‌య‌శాంతి సూచించారు.

  • Loading...

More Telugu News