China: చైనాకు షాకిచ్చిన అమెజాన్.. 3 వేల కంపెనీల తొలగింపు!

Amazon bans 3 thousand Chinese companies

  • 600 చైనా బ్రాండ్లను తొలగించిన ఈ-కామర్స్ దిగ్గజం
  • ఈ నిర్ణయంతో చైనాకు 130 మిలియన్ల ఆర్ఎంబీ నష్టం?
  • చైనాను టార్గెట్ చేయలేదని వివరణ ఇచ్చిన అమెజాన్

డ్రాగన్ కంట్రీకి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ షాకిచ్చింది. చైనాకు చెందిన 3 వేల కంపెనీలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 600 బ్రాండ్లను కూడా ప్రొడక్ట్ లిస్టు జాబితా నుంచి తొలగించింది. ఈ కంపెనీలు రివ్యూ నిబంధనలను ఉల్లంఘించినట్లు అమెజాన్ తెలిపింది.

‘మేడ్ ఇన్ చైనా.. సోల్డ్ ఇన్ అమెజాన్’ పేరుతో ఏర్పాటైన వ్యాపారుల సంఘం ఇలా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో చైనాకు కనీసం 130 మిలియన్ల ఆర్ఎంబీ (చైనీస్ కరెన్సీ) నష్టం వాటిల్లుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చైనా కంపెనీలు ఫేక్ రివ్యూలతోపాటు మరికొన్ని నిబంధనలు అతిక్రమించినట్లు తెలుస్తోంది.

అయితే అమెజాన్ నిర్ణయం వల్ల చైనా మార్కెట్‌కు పెద్దగా నష్టం ఏమీ లేదని, ఈ కంపెనీలు ఇతర ఈ-కామర్స్ వేదికల వైపు అడుగులు వేస్తున్నాయని చైనా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈబే, అలీఎక్స్‌ప్రెస్ వంటి వాటివైపు ఈ కంపెనీలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చైనా కంపెనీలపై కన్నెర్ర చేయడం అమెజాన్‌కు ఇది తొలిసారి కాదు.

కానీ ఈసారి సమస్యను ఈ ఈ-కామర్స్ దిగ్గజం చాలా సీరియస్‌గా తీసుకుంది. సదరు కంపెనీలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా తాము కేవలం చైనాను టార్గెట్ చేయడం లేదని, అన్ని దేశాల్లో ఇవే నిబంధనలు అమలవుతున్నాయని అమెజాన్ ఆసియా గ్లోబల్ సెల్లింగ్ వైస్ ప్రెసిడెంట్ సిండీ థాయ్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News