AP Fiber Net: ఏపీ ఫైబర్‌నెట్ కేసు.. సాంబశివరావుకు హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు
- ఫైబర్ నెట్ టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ కేసు
- టెరా సంస్థకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని సాంబశివరావుపై ఆరోపణలు
- 48 గంటల్లోగా బెయిలు లభించకుంటే ఉద్యోగం పోతుందన్న పిటిషనర్ తరపు న్యాయవాది
- దర్యాప్తునకు సహకరించాలంటూ షరతులతో కూడిన బెయిల్
ఏపీ ఫైబర్ నెట్ కేసులో మూడు రోజుల క్రితం అరెస్ట్ అయిన ఐఆర్‌టీఎస్ అధికారి కోగంటి సాంబశివరావుకు హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, బెయిలు మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. టెండర్లలో అక్రమాలకు తావే లేదని, బిడ్ దస్త్రాలను వివిధ కమిటీలు పరిశీలించాయని, ఇది ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయమని కోర్టుకు తెలిపారు. ఐఆర్‌టీసీ అధికారి అయిన సాంబశివరావును కేంద్రం నుంచి ముందస్తు అనుమతి లేకుండా విచారించడానికి వీల్లేదని, కానీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. 48 గంటల్లోగా ఆయనకు బెయిలు లభించకుంటే ఉద్యోగం పోతుందని కోర్టుకు తెలియజేశారు.
మరోవైపు, సీఐడీ తరపున అదనపు ఏజీ జాస్తి నాగభూషణ్ వాదనలు వినిపిస్తూ.. టెరా సంస్థ టెండర్లు దాఖలు చేసేందుకు వీలుగా టెండర్ గడువును పిటిషనర్ ఉద్దేశపూర్వకంగానే పొడిగించారని ఆరోపించారు. ఈ విషయంలో ఎంతమంది పాత్ర ఉందో తేల్చాల్సిన అవసరం ఉందని, కాబట్టి బెయిలు ఇవ్వొద్దని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సాంబశివరావుకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.
బెయిలిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం లేదన్న న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత సాంబశివరావుకు బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ తొలి దశ టెండర్లను టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలను సాంబశివరావు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో శనివారం సీఐడీ అధికారులు సాంబశివరావును అరెస్ట్ చేశారు.