Prakash Javadekar: 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ తో యుద్ధమే: ప్రకాశ్ జవదేకర్
- త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక
- కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
- రాష్ట్రానికి విచ్చేసిన ప్రకాశ్ జవదేకర్
- టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైనం
- హుజూరాబాద్ లో బీజేపీదే విజయం అని వెల్లడి
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకులు సైతం తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తాజాగా బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీదే విజయం అని ఉద్ఘాటించారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ తో యుద్ధం ఖాయమని స్పష్టం చేశారు.
ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ ప్రజల్ని మభ్యపెడుతోన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి అంటూ ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, వారి ఖాళీలను ఎక్కడ భర్తీ చేశారని నిలదీశారు. తెలంగాణలో ఏ వర్గానికి న్యాయం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో నేడు ప్రకాశ్ జవదేకర్ కూడా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ లో పాదయాత్ర సాగుతుండగా, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జవదేకర్ ప్రసంగించారు. బండి సంజయ్ చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్ర గతిని మార్చివేస్తుందని స్పష్టం చేశారు.