DRDO: డీఆర్‌డీవో రహస్యాల లీక్ ఘటనలో వెలుగులోకి కొత్త విషయాలు.. మహిళ కీలక పాత్ర!

DRDO Espionage Case Odisha Crime Branch Unearths Dubai Money Trail
  • నిందితులు బంగ్లాదేశ్ నుంచి వచ్చి బాలేశ్వర్‌లో స్థిరపడిన వలసదారులు
  • మహిళ ద్వారా యూపీ వ్యక్తులతో పరిచయం
  • మహిళతో చేసిన వాట్సాప్, ఫేస్‌బుక్ చాటింగ్ గుర్తింపు
  • పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోని స్లీపర్ సెల్స్ ద్వారా నగదు లావాదేవీలు
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందీపూర్‌లోని డీఆర్‌డీవో రహస్యాల లీకేజీ వెనక ఓ మహిళ పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి ఒడిశా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి నాలుగు రోజులుగా విచారిస్తున్నారు.

నిందితుల్లో ఒకరి బ్యాంకు ఖాతాకు దుబాయ్ నుంచి రెండు విడతలుగా రూ. 38 వేలు వచ్చినట్టు గుర్తించారు. అలాగే, ఓ మహిళతో నిందితులు ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసిన విషయం కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఆ మహిళ పాకిస్థానీ అని అనుమానిస్తున్నారు. యూకేకు చెందిన ఫోన్ నంబరు ద్వారా ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ఆమె చాటింగ్ చేసినట్టు గుర్తించారు.

ఆమె ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులతో పరిచయం ఏర్పడగా రహస్యాలు పంపేందుకు వారితో డీల్ కుదుర్చుకున్నారు. అంతేకాదు, ఆ మహిళ వేర్వేరు పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల వారితో చాటింగ్ చేసిన విషయం కూడా వెలుగుచూసింది. నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.  

మరోవైపు, భారత వైమానిక దళాధికారులు కూడా కటక్‌లో రెండు రోజులపాటు నిందితులను ప్రశ్నించారు. కాగా, యూపీ వ్యక్తుల చేతుల్లో చిక్కిన నిందితులు వారి ఆదేశాల మేరకు రహస్యాలు సేకరించి పంపేవారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నగదు లావాదేవీలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోని స్లీపర్ సెల్స్ ద్వారా జరిగేవని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి బాలేశ్వర్‌లో ఉంటున్న వలసదారులే వీరికి రహస్యాలు సేకరించి పంపేవారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
DRDO
Odisha
Crime Branch
Dubai
Pakistan

More Telugu News