Vijayashanti: పోడు ప్రాంతాల్లో కుర్చీ వేసుకొని అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తానన్నారు కదా?: కేసీఆర్పై విజయశాంతి విమర్శలు
- పోడు రైతులకు పట్టాలిప్పిస్తానన్నారు
- కేసీఆర్ స్వయంగా మూడుసార్లు అసెంబ్లీలో హామీ ఇచ్చారు
- అవే భూముల్లో అంగుళం కూడా వదలట్లేదు
- హరితహారంలో మొక్కలు నాటాలని ఆదేశాలు
- అందుకే గిరిజనులు, ఫారెస్టోళ్లకు ఘర్షణలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పోడురైతుల సమస్యల గురించి ఆమె ప్రస్తావించారు.
'పోడు రైతులకు పట్టాలిప్పిస్తానని సీఎం కేసీఆర్ స్వయంగా మూడుసార్లు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పోడు ప్రాంతాల్లో కుర్చీ వేసుకొని కూర్చుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తానన్నారు. కానీ.. అవే భూముల్లో అంగుళం కూడా వదలకుండా హరితహారంలో మొక్కలు నాటాలని ప్రభుత్వం ఫారెస్టోళ్లకు తెరవెనుక ఆదేశాలిస్తున్నది. దీంతో ఏటా వానాకాలంలో పంటలు వేసేందుకు గిరిజనులు, మొక్కలు నాటేందుకు ఫారెస్టోళ్లు భూముల్లోకి వస్తుండడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంటున్నది' అని ఆమె చెప్పారు.
'తమ భూముల జోలికి రావద్దని ఫారెస్టోళ్లను పోడు రైతులు కాళ్లావేళ్లా పడి వేడుకుంటున్నా వినడం లేదు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన రైతులపై హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. రాష్ట్రంలో వందలాది పోడు రైతులు అటు భూములు పోయి, ఇటు కేసులపాలై దయనీయంగా బతుకుతున్నారు. పొట్టకూటి కోసం తరతరాలుగా తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించాలని అడుగుతున్న అడవి బిడ్డలకు రాష్ట్ర సర్కారు పట్టాలియ్యకపోగా.. ఉల్టా కేసులు పెట్టి సతాయించడం సిగ్గుచేటు' అని ఆమె విమర్శించారు.
'గర్భిణులు, చంటి పిల్లల తల్లులు, వృద్ధులు అని కూడా చూడకుండా కటకటాల పాలు చేయడం చూస్తుంటే.. పోడు రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఇదే పోడు భూముల సమస్యపై సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజనులు పోరాటానికి దిగితే... వారిపై కక్ష పూరితంగా కేసులు నమోదు చేసి.. వారికి మద్దతుగా పోరాడిన బీజేపీ నాయకులపై కేసులు బనాయించి జైలుకు తరలించారు' అని విజయశాంతి విమర్శించారు.
'ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోడు భూముల సమస్యపై సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం హుజూరాబాద్ ఎన్నికలపైనే దృష్టి పెట్టి, కులాల వారీగా ఓట్లను ఎలా రాబట్టాలనే ఆలోచనతో ఉన్నారు. కావున యావత్ తెలంగాణ పోడు రైతులు కంకణబద్ధులై, టీఆర్ఎస్ పాలనకు తగిన బుద్ధి చెప్పాలి' అని విజయశాంతి చెప్పారు.