Andhra Pradesh: చంద్రబాబు మోసాలతో జాగ్రత్త.. వాటిని ఇంకా మానలేదు: సజ్జల
- మోసాలు చేయడం, భ్రమలు కల్పించడం జగన్ కు తెలియదు
- బాబు హయాంలో దోపిడీ జరిగింది
- రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశారు
- పారదర్శకంగా జగన్ పాలన
- లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు
ప్రజలను మోసం చేయడం, భ్రమలు కల్పించడంలో చంద్రబాబు దిట్ట అని, వాటిని ఆయన ఇంకా మానలేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మోసాలపై ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ముస్లిం సంచార జాతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
చంద్రబాబు హయాంలో 35 లక్షల మందికి పింఛన్లను ఇస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 60 లక్షల మందికి అందజేస్తున్నారని చెప్పారు. నాడు పింఛన్లకు రూ.500 కోట్లు కేటాయించేవారని, ఇప్పుడు అది రూ.1,400 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు తన హయాంలో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశారని, కానీ, జగన్ మాత్రం వివిధ పథకాల రూపంలో లబ్ధిదారుల ఖాతాలో రూ.లక్ష కోట్లు జమ చేశారని అన్నారు.
నాడు దోపిడీ సాగితే.. నేడు పారదర్శక పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబులా మోసాలు చేయడం, కుట్రలు, కుతంత్రాలు పన్నడం జగన్ కు తెలియవన్నారు.
ప్రతి పేద విద్యార్థికీ చదువు చేరువయ్యేలా జగన్ చర్యలు తీసుకుంటున్నారని సజ్జల అన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు విద్య, వైద్యం అందేలా నాడు–నేడు అనే పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రతి జిల్లాతో పాటు వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.