United Nations: ఐరాసలో ఆఫ్ఘనిస్థాన్ రాయబారిగా సుషైల్ షహీన్.. ప్రతిపాదించిన ఆ దేశ విదేశాంగ మంత్రి!
- ఐరాస చీఫ్ గుటెరస్ కు లేఖ
- క్రెడెన్షియల్ కమిటీకి పంపిన గుటెరస్
- కమిటీ చర్చించాక నిర్ణయం తీసుకోనున్న ఐరాస
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. ఇక అంతర్జాతీయ సంబంధాలపై దృష్టి సారించారు. ఐక్యరాజ్యసమితిలో తమ దేశ రాయబారిని ప్రతిపాదించారు. దోహా చర్చల్లో కీలకంగా వ్యవహరించిన తాలిబన్ల ప్రతినిధి సుహైల్ షహీన్ ను ప్రతిపాదిస్తూ ఐరాస చీఫ్ కు లేఖ రాశారు.
షహీన్ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కు లేఖ రాశారని గుటెరస్ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ గత ప్రభుత్వ రాయబారి గులాం ఐజాక్జాయ్ కు బదులుగా షహీన్ పేరును ప్రతిపాదించారని తెలిపారు.
ఆ లేఖను అమెరికా, చైనా, రష్యా సహా తొమ్మిది సభ్యుల క్రెడెన్షియల్స్ కమిటీకి పంపామన్నారు. ఆఫ్ఘన్ రాయబారిగా ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడే బాధ్యతను షహీన్ కు అప్పగించారు ముత్తాఖీ. అయితే, సోమవారం నాటికి కమిటీ భేటీ అయ్యే అవకాశం లేకపోవడంతో.. ముత్తాఖీనే ఐరాసలో మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి.
మామూలుగా అక్టోబర్ లేదా నవంబర్ లోనే కమిటీ సమావేశం అవుతుంది. ఏడాది చివర్లో సభ్య దేశాలకు సంబంధించిన క్రెడెన్షియల్స్ పై నివేదికను అందజేస్తుంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే విజ్ఞప్తులపై ఐరాస నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు షహీన్ నియామకాన్ని కమిటీ ఏ మేరకు సమర్థిస్తుంది? ఐరాస ఒప్పుకొంటుందా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.