Uk Travel: సమస్య కొవిషీల్డ్ కాదు.. భారత సర్టిఫికెట్: యూకే మెలిక
- కోవిన్ ధ్రువపత్రంపై అనుమానాలున్నాయన్న యూకే
- కొవిషీల్డ్‌కు గుర్తింపు లభించినా భారతీయులకు క్వారంటైన్ తప్పనిసరి
- ధ్రువపత్రంలో సమస్యలు లేవన్న భారత్
- యూకే రాయబారితో సాంకేతిక చర్చలు
భారతీయులపై విధించిన క్వారంటైన్ నిబంధనలపై దుమారం రేగడంతో యూకే ప్రభుత్వం దిగొచ్చింది. కొవిషీల్డ్‌కు గుర్తింపు ఇస్తూ సవరించిన ప్రకటన విడుదల చేసింది. అయితే ఇక్కడ మరో మెలిక పెట్టింది. తమ సమస్య కొవిషీల్డ్ టీకాతో కాదని, భారత్‌లో లభించే వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రంతో అని చెప్పింది. ప్రస్తుతం భారత్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి కోవిన్ యాప్ ద్వారా ధ్రువీకరణ లభిస్తోంది. దీనిపైనే బ్రిటన్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది.
కాబట్టి కొవిషీల్డ్ తీసుకున్న భారతీయులు కూడా యూకే వచ్చినప్పుడు క్వారంటైన్లో ఉండాల్సిందేనని వెల్లడించింది. తమ అనుమానాలు తీర్చుకునేందుకు భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని ప్రకటించింది. యూకే తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు అక్టోబరు 4 ఉదయం నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే.
కొన్నిరోజుల క్రితం ప్రకటించిన ఈ నిబంధనల్లో భారత్ సహా పలు దేశాలకు యూకే ప్రభుత్వం షాకిచ్చింది. ఈ దేశాల నుంచి వచ్చే వారు కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా సరే వారిని టీకా తీసుకోని వారిలాగే పరిగణిస్తామని ప్రకటించింది. దీనిపై భారత్‌లో చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంపై పునరాలోచించాలని లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలో తాజాగా ఈ నిబంధనలను సవరించి, కొవిషీల్డ్‌కు గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.
కానీ భారత్‌లో లభించే సర్టిఫికేషన్‌పై అనుమానాలు ఉన్నాయని, కాబట్టి భారతీయులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని తెలిపింది. ఈ సమస్యసై నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్.ఎస్.శర్మ స్పందించారు. టీకా ధ్రువపత్రం అందించే ప్రక్రియలో ఎటువంటి సమస్యా లేదని, కోవిన్ యాప్‌లో కూడా ఇబ్బందులు లేవని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ జరుగుతోందని వివరించారు.
ఈ విషయంలో పలు అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే ఇటీవల యూకే రాయబారి కూడా కోవిన్ సాంకేతికత గురించి తెలుసుకునేందుకు తనను సంప్రదించినట్లు శర్మ తెలిపారు. ఈ వివరాలను ఆయనకు వివరించేందుకు ఏర్పాట్లు చేశామని, ఇవన్నీ సాంకేతిక చర్చలని శర్మ పేర్కొన్నారు.