Uma Bharti: అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అనంతరం విచారం వ్యక్తం చేసిన ఉమాభారతి!

Deeply Hurt By Own Words Uma Bharti On Slippers Remark For Bureaucrats
  • ప్రభుత్వ అధికార వ్యవస్థ ఓ మిథ్య అన్న బీజేపీ నేత
  • అధికారులు ఉన్నది రాజకీయ నాయకుల చెప్పులు మోసేందుకేనని వ్యాఖ్య
  • తన వ్యాఖ్యలు తననే గాయపరుస్తున్నాయని పశ్చాత్తాపం
అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి విచారం వ్యక్తం చేశారు. ఆ వాఖ్యలు తననే తీవ్రంగా బాధించాయని వాపోయారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నారు.

ఓబీసీ నేతలు కొందరు శనివారం ఉమాభారతిని భోపాల్‌లోని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బ్యూరోక్రసీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికార వ్యవస్థ ఓ మిథ్య అని, అధికారులు ఉన్నది రాజకీయ నాయకుల చెప్పులు మోసేందుకేనని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ, ఉమాభారతి వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దిగ్విజయ్ లేఖపై స్పందించిన ఉమా భారతి నిన్న ఆయనకు లేఖ రాశారు.

తాను చేసిన వ్యాఖ్యలు తననే గాయపరుస్తున్నాయని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అలా మాట్లాడాల్సింది కాదని విచారం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలం వాడొద్దని పదేపదే మీకు చెప్పే నేనే అలాంటి పదాలు వాడినందుకు బాధగా ఉందని, ఇకపై తన భాషను మెరుగుపరుచుకుంటానని, మీరు కూడా అలానే చేయాలని ఉమా భారతి ఆ లేఖలో పేర్కొన్నారు.
Uma Bharti
BJP
Digvijaya Singh
Congress
Bureaucrats

More Telugu News