USA: అమెరికాకు తిరిగి వెళ్లనున్న ఫ్రెంచి రాయబారి
- బైడెన్-మాక్రాన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ
- ఫ్రెంచి రాయబారిని వాషింగ్టన్ పంపుతున్నట్లు తెలిపిన ప్రభుత్వం
- జలాంతర్గాముల కొనుగోలు వివాదంలో అసంతృప్తి
- అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి రాయబారులను వెనక్కు పిలిచిన ఫ్రాన్స్
ఫ్రాన్స్ ప్రభుత్వంతో 2016లో చేసుకున్న జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి అణుశక్తి ఆధారిత సబ్‌మెరీన్లను కొనుగోలు చేసేందుకే ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఫ్రెంచి ప్రభుత్వం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఉన్న తమ దేశ రాయబారులను స్వదేశానికి పిలిపించేసింది.
ఇలా జరగడం చరిత్రలో తొలిసారి. అయితే ఈ చర్యల అనంతరం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ముందుకొచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని కొన్నిరోజుల క్రితం ఫ్రాన్స్ ప్రతినిధి వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో మాక్రాన్-బైడెన్ మధ్య టెలిఫోన్ కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాధినేతలూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మాక్రాన్‌తో బైడెన్ మాట్లాడారు. ఆస్ట్రేలియాతో రక్షణ ఒప్పందం విషయంలో తాము ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండాల్సిందని బైడెన్ అంగీకరించినట్లు సమాచారం. బైడెన్‌తో మాట్లాడిన తర్వాత ఫ్రాన్స్ ప్రభుత్వ ఆగ్రహం కొంత తగ్గినట్లు కనబడుతోంది. త్వరలోనే ఫ్రెంచి రాయబారిని అమెరికా పంపుతామని ప్రభుత్వం ప్రకటించింది.