Black Mail: మహారాష్ట్రలో మరో ఘోరం.. బ్లాక్‌మెయిల్ చేసి బాలికపై 29 మంది అత్యాచారం

29 men sexually assaults 15 year old girl by blackmailing

  • ప్రధాన నిందితుడు అమ్మాయి స్నేహితుడే
  • అత్యాచారం చేస్తూ వీడియో తీసిన మిత్రుడు
  • ఆ వీడియో వేరే వ్యక్తికి చేరడంతో బ్లాక్‌మెయిల్
  • ఇలా మొత్తం 29 మంది దుర్మార్గం.. ఫిర్యాదు చేసిన బాలిక

కొన్నిరోజుల క్రితం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నిర్భయ తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన గురించి మర్చిపోకముందే మరో ఘోరం వెలుగు చూసింది. డోంబివలీ ప్రాంతంలో నివసించే ఒక 15 ఏళ్ల బాలికపై 29 మంది అత్యాచారం చేశారు. ఈ ఘోరం కొన్ని నెలలుగా సాగుతూనే ఉంది. తొలుత ఆ బాలిక స్నేహితుడు ఈ ఏడాది జనవరిలో ఆమెను బలాత్కరించాడు. తాను చేసిన ఘనకార్యాన్ని వీడియో కూడా తీశాడు.

ఈ వీడియో అతని దగ్గర నుంచి మరో వ్యక్తికి చేరింది. ఆ వ్యక్తి బాలికను బ్లాక్‌మెయిల్ చేశాడు. వీడియోను వైరల్ చేసేస్తానని బెదిరించి ఆ బాలికను బలాత్కరించాడు. ఇలా ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తి ఇలాగే వీడియో చూపించి ఆమెను బలాత్కరించాడు. ఇలా ఈ ఏడాది సెప్టెంబరు వరకూ తనపై 29 మంది లైంగిక దాడి చేసినట్లు సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని స్థానిక ఏసీపీ దత్తాత్రేయ కరాలే వెల్లడించారు. ఇప్పటి వరకూ ఇద్దరు మైనర్లు సహా 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులందరూ బాధితురాలికి తెలిసిన వారే కావడం గమనార్హం. వీళ్లందరూ కూడా వీడియోను చూపించి పలు సందర్భాల్లో బాలికపై లైంగిక దాడులు చేశారని కరాలే వివరించారు.

బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని ఆయన తెలిపారు. నిందితులు ఉపయోగించిన వీడియో సహా ఇతర ఆధారాలను తమ బృందం సేకరిస్తోందని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడైన బాలిక స్నేహితుడే ఈ వీడియోను మిగతా వారికి పంపాడని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News