Corona Vaccine: మూడింట రెండొంతుల మంది పెద్ద వారికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్: వీకే పాల్
- వెల్లడించిన నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్
- 18 ఏళ్లు నిండిన వారిలో 66 శాతానికి కనీసం ఒక డోసు
- పెద్దవారిలో పావు వంతు పూర్తయిన వ్యాక్సినేషన్
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగం పుంజుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు నాడు దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని మొత్తం వయోజనుల జనాభాల్లో మూడింట రెండొంతుల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందిందని నీతి ఆయోగ్ సభ్యుడు, దేశంలో కరోనా టాస్క్‌ఫోర్స్ అధినేత వీకే పాల్ వెల్లడించారు.
గురువారం నాడు కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చే సమయంలో ఆయన కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 18 ఏళ్ల వయసు పైబడిన వారిలో 66 శాతం మందికి కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ అందిందని తెలిపారు. మొత్తం వయోజనుల్లో దాదాపు 25 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారని, వారికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లేనని పేర్కొన్నారు.
అలాగే దివ్యాంగులకు, మానసిక సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీని జారీ చేసినట్లు చెప్పారు. ఈ విషయం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు.