Software Engineer: మిత్రుడినే కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు

Software engineer  kidnapped His friend in Bengaluru
  • బెంగళూరులో ఘటన
  • స్నేహితుడి నుంచి రావాల్సిన డబ్బుల వసూలు కోసం కిడ్నాప్
  • బాధితుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 2 కోట్ల డిమాండ్
  • ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
తనకు ఇవ్వాల్సిన పాత బకాయిలను వసూలు చేసుకునేందుకు మిత్రుడినే కిడ్నాప్ చేశాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిన ప్రశాంత్, అరివేగన్, సంతోష్‌, వినీత్ స్నేహితులు. సంతోష్, వినీత్ ఇద్దరూ ఒకేచోట పనిచేసేవారు.

వినీత్ ఇటీవల ఓ స్టార్టప్ ప్రారంభించి మరో సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. దీంతో గతంలో తనవద్ద తీసుకున్న డబ్బులు చెల్లించాల్సిందిగా సంతోష్ అతడిపై ఒత్తిడి తెచ్చాడు. ఇచ్చేందుకు వినీత్ నిరాకరించడంతో అతడి నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవాలని నిర్ణయించిన సంతోష్ స్నేహితులతో కలిసి వినీత్‌ను కిడ్నాప్ చేయాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా పార్టీ ఇస్తున్నా రమ్మని వినీత్‌ను ఆహ్వానించాడు.

ఈ క్రమంలో మంగళవారం వినీత్‌ను కిడ్నాప్ చేసిన నిందితులు కారులో తీసుకెళ్లి చెన్నై సమీపంలో ఓ ఇంట్లో బంధించారు. బుధవారం రాత్రి వినీత్ కుటుంబ సభ్యులకు వాట్సాప్ కాల్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కాల్‌డేటా ఆధారంగా ప్రశాంత్, సంతోష్, అరివేగన్‌ లను అరెస్ట్ చేసి వినీత్‌ను రక్షించారు.
Software Engineer
Karnataka
Bengaluru
Kidnap

More Telugu News