Telangana: మూడు రోజుల పర్యటన కోసం నేడు ఢిల్లీకి కేసీఆర్.. రెండువారాల్లోనే రెండోసారి
- శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ అనంతరం ఢిల్లీకి
- నదీ జలాల అంశంపై మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ
- ఆదివారం అమిత్ షాతో సమావేశం
ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేడు మరోమారు హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలో గడుపుతారు. ఈ ఉదయం శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు. కేంద్రమంత్రులతో కేసీఆర్ కీలక అంశాలపై చర్చిస్తారని సమాచారం.
కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ చర్చిస్తారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్వహించే ముఖ్యమంత్రుల సమీక్షకు కేసీఆర్ హాజరవుతారు.
అనంతరం పీయూష్ గోయల్‌తోనూ సమావేశమవుతారు. ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఈ నెల 1న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ 9 రోజులపాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత రెండు వారాలకే మళ్లీ ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.