India: మోదీ–కమలా హారిస్ సమావేశం.. పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా ఉపాధ్యక్షురాలు
- ఉగ్రవాదంలో పాక్ పాత్రపై సీరియస్
- వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
- భారత్, అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లకూడదని హెచ్చరిక
- పలు అంశాలపై గంట పాటు చర్చించిన ఇరువురు నేతలు
- జూన్ నాటి ఫోన్ సంభాషణను గుర్తు చేసిన మోదీ
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టాక.. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆయన బైడెన్ తో సమావేశం కానున్నారు. అయితే, అంతకుముందు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో మోదీ సమావేశమయ్యారు.
వారిద్దరి తొలి భేటీలో పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై కమలా హారిస్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్, అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని పాక్ ను డిమాండ్ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని కమల చెప్పారంటూ విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ శృంగాలా తెలిపారు. పాకిస్థాన్ అండగా ఉంటున్న ఉగ్రవాద సంస్థలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందంటూ ఆమె అభిప్రాయపడ్డారన్నారు.
కాగా, సమావేశంలో భాగంగా కమలా హారిస్, ప్రధాని మోదీలు గంట పాటు మంతనాలు జరిపారు. భారత్–అమెరికా వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, పరస్పర ప్రయోజనాలున్న అంతర్జాతీయ అంశాలు, ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు, ఇండో–పసిఫిక్ లో పరిస్థితులపై చర్చించారు. ఉగ్రవాదం అంశం చర్చకు వచ్చినప్పుడు కమలా హారిస్ స్వయంగా ఉగ్రవాదంలో పాకిస్థాన్ పాత్రను ప్రస్తావించారు. ప్రజాస్వామ్య విలువలనూ కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ ఏడాది జూన్ లో కమలతో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఆ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా ఉద్ధృతి ఎక్కువగా వున్న సమయంలో ఆదుకున్నారని చెప్పారు. కుటుంబ సభ్యురాలిగా ఆపన్న హస్తం అందించారని గుర్తు చేశారు. ఆ రోజు ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన తీరును ఎన్నటికీ గుర్తుంచుకుంటానని కమలతో అన్నారు. సహకారంపై మంచి సందేశాన్నిచ్చి నిజమైన స్నేహితురాలు అనిపించుకున్నారన్నారు. ఒకే విలువలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలున్న భారత్, అమెరికా సహజ భాగస్వాములని చెప్పారు.